ఎవరు రమ్మన్నారు కొడుకా… మిమ్మల్ని ఎవరు పొమ్మన్నారు కొడుకా…
ఎందుకొచ్చినారు బిడ్డా ఎందుకు ఇడిసెళ్ళి పోతుండ్రు బిడ్డా..
దునియ మొత్తం లోనే నన్నూ దొరసాని అన్నారు కొడుకా
దూరదూరం నుండి వచ్చీ నన్ను మురిసేల చేసిండ్రు బిడ్డా..
మీ బ్రతుకు దెరువుకు మీ సదువు కొలువులకు నగరానికొచ్చారే..
పొట్ట చేత పట్టి పట్టణానికొచ్చి చెట్టంత ఎదిగారే
కులము తలము లేదు వేష భాషలు లేవు అందరిని మోసిందే
గడప తొక్కినోళ్ల కడుపు లోన పెట్టి అమ్మల్లే చూసిందే

నన్ను భాగ్యనగమన్న మీరే అభాసుపాలు చేసినారే
ఎన్ని చూసాను నేను గాయాలే ఇంత వడపోత నాకెపుడు రాలే

కడమీన భాగ్యాన్ని నేను మట్టి లోనుండి పుట్టుకొచ్చాను
ఓ మారాజు మోహించె నన్ను భాగ్యనగరంగ వెలుగొందినాను
అన్ని దిక్కులనుండి మీరు ఇన్నమంటి న కాడికొచ్చారు
కన్నా తల్లివోలె నేను కడుపులో పెట్టి చూసుకున్నాను

గుండెల్లో లక్ష్యం తో ఉన్న ఊరు వొదిలి బండెక్కి వచ్చారే
కొండత అండై ఎండల్లో వానల్లో గొడుగళ్లే కాసిందే
మీ కాళీ జేబులకు మీ గాలి మెడలకు రాదారి చుపిందే
వెదురల్లే కదిలొచ్చి వేణువుల ఎదిగేంత వేదికను ఇచ్చిందే

తల్లి గుణము నాది కొడుకా నీ మేలు తప్ప కీడు తలువా
ఎవరు చేసిన పాప పుణ్యం నేను అయిపోయినానిపుడు పలువా
రాష్ట్రాలుగా వేరు అయినా ఈడనే ఉన్నారు నన్నొదలలేక
రాజకీయం చిత్ర సీమ మీడియా అందరికి ఇచ్చాను నీడా
కండ కాండాలు గా కోసీ నాతో చేసారు రియలు దందాలు
పరదేశ మోజుల్లో మునిగీ పాడుచేశారు పాత మూలాలు

అక్కర తీరక పక్కన ఇసిరేసి ఎక్కడికో పోతే
పోటీలు పడి నింగి తాకేలా కట్టిన మేడలెవడిపాలు
ఆపదలు ఎదురైతే ఏ ముందు జాగరత నీలోనా లేకుండా
నరికేసుకుంటారే నీడను ఇచ్చేటి నిలుచున్న వృక్షాలు

పల్లె ఇడిసి మీరువత్తె అప్పుడా తల్లి ఎంత ఏడ్సినాదో
ఇప్పుడిడిసి పోతానంటే నన్ను గుండె సెరువాయ్ పోతుంది బిడ్డా